ఏపీలోని అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ జరుగుతుంది…ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ రచ్చ నగరి నియోజకవర్గంలో కూడా ఉంది. అక్కడ ఎమ్మెల్యే రోజాకు చెక్ పెట్టాలని సొంత పార్టీ నేతలే చూస్తున్నారని తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదొక సందర్భంలో నగరి హైలైట్ అవుతూనే వస్తుంది.
అక్కడ గ్రూపు రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్నాయి. ఇక దీనిపై రోజా అప్పట్లోనే మీడియా ముందుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. తనకు వ్యతిరేకంగా నగరిలో కొందరు రాజకీయం చేస్తున్నారని మాట్లాడారు. తాజాగా కూడా ఒక ఎంపీపీ పదవి విషయంలో రోజాకు, రెడ్డివారి చక్రపాణిరెడ్డిల మధ్య రగడ నడుస్తుంది. రోజాకు చెక్ పెడుతూ చక్రపాణిరెడ్డి నిండ్ర మండలం ఎంపీపీని దక్కించుకోవాలని చూస్తున్నారు.
దీనిపై రోజా కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. తన వ్యతిరేక వర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. కానీ నగరిలో రెడ్డివారి చక్రపాణిరెడ్డి కుటుంబం ఎప్పటినుంచో రాజకీయం చేస్తుంది. 2014లోనే నగరి టికెట్ దక్కించుకోవాలని చక్రపాణి చూశారు గానీ, అది వర్కౌట్ కాలేదు. రోజాకు టికెట్ ఇవ్వడంతో ఆమె గెలుపు కోసం కృషి చేశారు. 2019 ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అయింది. అయితే ఈ సారి తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ చక్రపాణి ముందుకెళుతున్నారు.
దీంతో నగరిలో రోజాకు తలనొప్పి ఎక్కువైపోయింది. ప్రస్తుతం శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న చక్రపాణి వర్గానికి చెక్ పెట్టడం అంత సులువైన పనిలా కనిపించడం లేదు. కాకపోతే రోజాకు మంత్రి పదవి దక్కితే కాస్త పరిస్తితి మారే అవకాశం ఉంటుంది. అప్పుడు నియోజకవర్గం మొత్తం రోజా కంట్రోల్‌లో ఉండే ఛాన్స్ ఉంది. మరి రోజాకు ఆ ఛాన్స్ దొరుకుతుందో లేదో చూడాలి.