ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంత బాబు. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు ఆయనే కారణమని మృతుని భార్య ఆరోపిస్తూ, పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎటువంటి అరెస్టూ లేదు. అరెస్టుకు సంబంధించి పోలీసులు తర్జనభర్జన పడుతున్నారని మాత్రం తెలుస్తోంది. మరోవైపు ఏలూరు రేంజ్ డీఐజీ మాత్రం ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని వార్తలు అందుతున్నాయి. ఇవి కూడా ఇంకా నిర్థారణలో లేవు. ఇవాళ ఏ క్షణం అయినా ఆయన్ను అరెస్టు చేయవచ్చన్న వార్తలు మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు బాధితురాలిని టీడీపీ అధినేత ఫోన్ లో పరామర్శించారు. అదేవిధంగా పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల సాయం ప్రకటించారు. అయితే దళిత సంఘాలకు చెందిన కార్యకర్తలతో టీడీపీ ఉద్యమ కార్యాచరణ అయితే చేపట్టలేకపోతోంది. అందుకు వైసీపీ విధిస్తున్న నిర్బంధ కాండే ఓ కారణం అని తెలుస్తోంది. మరోవైపు అనంతబాబుకు ఉన్న రాజకీయ పరిచయాలు,గతంలో ఆయన చేసిన తప్పిదాలు, బాబు హయాంలో చేసిన తప్పిదాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకవేళ ఎమ్మెల్సీ అరెస్టుకు పట్టుబట్టినా, కీలక సామాజిక వర్గం ఓట్లు పోతాయేమో అన్న భయం కూడా టీడీపీని వెన్నాడుతోంది. కనుక కొన్ని చోట్ల మాట్లాడి కొన్ని చోట్ల మాట్లాడకుండా టీడీపీ కాస్త బ్యాలెన్సెడ్ పాలిటిక్స్ ను నడుపుతోంది.