రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే నెరవేరుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఆమె వివరించారు. లండన్ పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు అక్కడి అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కర్ అండ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ యూకే సంయుక్త కార్యదర్శి శామ్ కుమార్ ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించి దూరదృష్టితో రాజ్యాంగంలో ఆర్టికల్- 3ను చేర్చారని చెప్పారు. తనకు అంబేద్కర్ అంటే ఆదర్శమని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో తాను 48 గంటల పాటు నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు. ప్రజల కోసం మరింత పనిచేయాలని ఆదర్శాన్ని ఇచ్చేటువంటి ఆహార్యం అంబేద్కర్ దని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో యూకే రాజకీయ నాయకులు, ఎన్నారైలు, పౌర సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు హాజరుకానున్నారు.అలాగే లండన్‌లోని అంబేద్కర్ మ్యూజియాన్ని కల్వకుంట్ల కవిత సందర్శించారు. శనివారం ఎన్ఐఎస్ఏయు ఆధ్వర్యంలో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో సంభాషించారు.