రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ .. రాష్ట్రపతి ప్రసంగం దేశానికి ఆదర్శమని వ్యక్తపరిచారు. ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కింది అన్నారు. నిన్న జరిగిన సభలో కొందరు సభ్యులు ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారన్నారు. నిన్న ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారని రాహుల్ గాంధీని ఉద్దేశించి సెటైర్లు వేశారు మోడీ. నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయన్నారు.
2004 నుంచి 2014 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలిందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఎన్నో భారీ స్కాంలు జరిగాయని మండిపడ్డారు మోడీ. ఆ దశాబ్దం అవినీతి దశాబ్దం అని పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలిందని చెప్పారు. ఆ దశాబ్ద కాలం దేశంలో రక్తపుటేరులు పారాయని విమర్శించారు. ఆ పది సంవత్సరాలు భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే..కేసులు ఓడిపోతే సుప్రీం కోర్టు తీర్పును కూడా తప్పుబట్టేవారన్నారు.
ప్రపంచ దేశాలన్నీ ఈరోజు భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారవెల్లడించారు. మొబైళ్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందని… డిజిటల్ ఇండియాను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని చెప్పారు. ఇంధన వినియోగంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. కామన్ వెల్త్ క్రీడల్లో మన ఆడపిల్లలు అద్భుతంగా తమ సత్తా చాటుతున్నారు అని కొనియాడారు. స్టార్టప్ లో మనం మూడో ప్లేసులో ఉన్నామన్నారు. ప్రతి రంగంలో భారత్ చరిత్ర సృష్టిస్తోందన్నారు. ఇవన్నీ చూసిన కొందరు నిరాశవాదులకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఏం చేశామో ప్రజలకు తెలుసని మోడీ తెలియచేసారు.