దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర వేడుకల వేదికైన ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వచ్చే 25 ఏళ్లు 5 అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నారని.. బానిసత్వపు ఆలోచనను మనసులో నుంచి తీసిపారేయండని కోరారు. మనదేశ చరిత్ర , సంస్కృతి చూసి గర్వపడాలని తెలిపారు. ఐకమత్యంతో ప్రజలంతా కలిసి పనిచేయాలి.. ప్రతి పౌరుడు తమ బాధ్యతను గుర్తుంచుకుని పనిచేయాలని స్పష్టం చేశారు.
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని పునరుద్ఘాటించాం. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. అమూల్యమైన సామర్థ్యం ఉందని దేశం నిరూపించుకుందన్నారు ప్రధాని మోడీ. త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్య్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్య్రాన్ని అందించారని, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని చెప్పారు. గాంధీజీ, చంద్రబోస్, అంబేద్కర్ వంటివారు మార్గదర్శకులని వెల్లడించారు.