సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు తోపాటు శ్రీ విద్యానికేతన్ డైరెక్టర్లుగా ఉన్న కుమారులు విష్ణు, మనోజ్ కూడా ఏపీ హైకోర్టులో విచారణకు నేడు హాజరవుతున్నారు. 2019 మార్చిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల కోసం శ్రీవిద్యానికేతన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఇది కోడ్ ఉల్లంఘనే అంటూ చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. తాను బీజేపీ మనిషినని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని చెప్పారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో తిరుపతిలో తన శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి ధర్నా చేసిన కేసులో కోర్టు విచారణ కోసం ఆయన తిరుపతికి వచ్చారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారనే ఆరోపణలతో కేసు నమోదయింది. మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ లతో పాటు శ్రీవిద్యానికేతన్ ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్ లపై కూడా కేసు నమోదయింది. కాసేపట్లో తన కుమారులు విష్ణు, మనోజ్ లతో కలిసి మోహన్ బాబు కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను రియల్ హీరోనని, విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.