పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో విపక్షాలు వాయిదా తీర్మానాలు చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌పై చర్చించాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా నిరుద్యోగులు నష్టపోతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌లో సవరణలు చేయాలని విపక్షాలు ఆరోపణలు చేశారు. నిబంధన 297 కింద కాంగ్రెస్ సీపీఎం, ఎంపీలు తీర్మానాలు అందజేశారు. సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ప్రభుత్వం అగ్నిపథ్ పతకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ధరల పెరుగుదల, దేశ ఆర్థిక వ్యవస్థపై చర్చించాలని తెలిపారు.
పార్లమెంట్‌లో అన్ని పార్టీల సమావేశంలో 13 అంశాలను లేవనెత్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. వీటిపై ఉభయ సభల్లో చర్చించాలని అఖిలపక్ష భేటీలో కోరామన్నారు. వర్షాకాల సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. కేవలం 14 రోజుల్లో వీటిపై చర్చించనున్నారు. అయితే అతి తక్కువ సమయంలో 32 బిల్లులను అమోదించడానికి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అఖిలపక్ష భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.