ఫస్ట్ కాజ్ : విరాట పర్వం సినిమా చూసి వచ్చాక .. కొన్ని గొంతుకల తార్లాటను నీడల కొట్లాటను ఇష్టపడుతూ విభేదిస్తూ..ఆంతరంగిక చర్చకు అర్థాన్వయం నా వాక్యం అని నిర్థారిస్తూ.. వినిపిస్తున్నానొక మార్నింగ్ రాగా …
రాస్తున్నానొక మార్నింగ్ రాగా…
ఎవరో ఎక్కడి నుంచో వస్తారు.. గూటి పక్షుల రాగం వినిపించి వెళ్తారు.. వీటిని అతిథులుగా గుర్తించాలి మనం. ఎవ్వరినీ ప్రశ్నించడం నేర్చుకోలేనప్పుడు ఈ రాగాలాపనలకు అర్థాలు వెతికి ఏం చేయగలం. కవిత్వమే కాదు జీవితం కూడా ప్రశ్నించడంలో అర్థరహిత చర్యలనే ఆశ్రయించి ఉంది. కానీ సిసలు ప్రశ్నలు తూటాల నుంచి కాకుండా హృదయాల నుంచి వస్తాయి..అవే గత కాలపు వెలికితీతల చెంత బాగుంటాయి. తుపాకీ వెనుక కాలం ఉంది..అడవి వెనుక నిశ్శబ్దం ఉంది..
కాలం, నిశ్శబ్దం కలిసి చేసిన చెలిమిలో జీవితేచ్ఛ ఒక విలయకార విధ్వంసం కావొచ్చు..పాట వింటే విషాదం నుంచి ఏరుకున్న కొన్ని అనునయ పదాలే వెన్నంటి ఉంటున్నాయి. పుస్తకాల్లో ఏమయినా ఇటువంటి విస్ఫోటనాలు ఉన్నాయా అని వెతికి చూసే రోజులు ఇప్పుడేం లేవు.. ఆ బాధ్యత ఇప్పటి వారికి లేదు కనుక ! పాటనూ, తుపాకీ శబ్దాన్నీ, ఇంకా రాజ్య హింసనూ, ఇంకా కొన్నింటిని..కొన్ని అవసరాల నుంచి కాకుండా ప్రయోజనాల నుంచి ప్రతిపాదిస్తే విప్లవాలకు అర్థం తప్పక తెలిసి వస్తుంది.
శకుంతల టీచర్ మీరు ఎలా ఉన్నారు ..? నేను చెబుతున్నవి నిజమే కదా ! అరుణక్క, భారతక్క, విమలక్క ఇంకొన్ని జలపాత గీతికలు ఎట్లున్నయ్ ! వాటి గురించి కూడా విరాట పర్వంలో ఆరా తీయుండ్రి ! ఆచూకీ వస్తాది..అమరుడి స్థూపం దగ్గర
గొంతుకల కొట్లాట ఇవాళ రాజకీయ అవసరం ఎందుకని ??? ఏమయిందని ఆ స్ఫూర్తి అన్నది కూడా తెలిసి వస్తది ? ఇంకా వీటికి అనుగుణం అయిన సారస్వత సారం ఒకటి నెత్తుటి ధారల్లో వినిపించే ఉంటుంది..ఆ గొంతుకల కోసం..సైద్ధాంతికత కోసం రవన్న దళం ఏం చెప్పిందో మీరు సినిమాలోనే చూడుండ్రి…
మాట మాటకూ మోగు కిన్నెర ఏమయింది అని వెతికాను.. ఆహా ! జీవితం ఒక ఒడ్డున నిస్వరం అని తేలింది. ఆహా ! జీవితం చితి మంటల వేదికలపై ఓ వెలుగు గీతికలకు స్వరం రాస్తున్నది. మీరు ఈ దేశానికీ, ఈ అడవికీ ఈ ఉషః కాంతులకు ఏమిచ్చారో వెతికి చూస్తే, తరచి చూస్తే పాట మోగుతుంది. మాట – మౌన చింతనల చెంత విచ్చలవిడితనం వీడి బాధ్యతను పొంది ఉంటుంది. బాధ్యతలను విప్లవం ఒక్కటే కాదు ఇంకొన్ని కూడా ఇస్తాయి..మనం గుర్తించడం లేదు కదా ! ఆ తరహా గుడ్డితనం వద్దనుకుంటే ఆ జలపాతాల ఉరవళ్లలో వదిలిన ఊపిరులు లేదా ఆ అడవి దారుల్లో వదిలిన ప్రాణాలు..ఇంకా కొన్ని ఏవో సందేశిస్తాయి. గుర్తిస్తే చాలు మీ అనుకునే తత్వం, మీ అనుకునే గుణం..గుడ్డితనంను పోగొట్టి వెళ్తాయి..మనుషులు అంధకారం వదలడమే సిసలు ప్రేమ..దేహాచ్ఛాదనలకు అర్థం వెతికే కన్నా ఇంకా ఏవో ఈ తరహా కొన్ని పనులు చేసి వెళ్లాలి. అవన్నీ ప్రేమకు సంకేతికగా నిలుస్తాయి..విప్లవం ప్రేమను సంకేతిస్తుందా ? ప్రేమకు జవం – జీవం అందించిన, సంబంధించిన కవిత్వం ఉదయాలను సంస్కరిస్తుందా ? విరాట పర్వం వీటినన్నింటినీ వినిపిస్తోంది. మీరు మీ చెవిటితనం వదులుకుంటే.. మీరు మీ గుడ్డితనం వద్దనుకుంటే…
అసహజ స్వేచ్ఛ లేదు.. ఊహకు అతీతం అయిన ఆలోచన లేదు. మన జీవితం ఎవరో ఒకరి త్యాగ ఫలం. వీటిలో అమరత్వాన్నీ, అస్తిత్వాన్నీ గుర్తించకుండా బాధ్యత లేకుండా తిరుగాడి ఎవ్వరినో నిందిస్తాం. వేరొకరివ్వరినో అనుమానిస్తాం.. ప్రేమ ప్రసాదించిన స్వేచ్ఛ గొప్పది..వినియోగంలో ఉన్నంత వరకూ వెన్నెల కూడా దాని ఉనికికి తోడ్పాటు. వరంగల్లు దారుల్లో ప్రవచించిన కథ.. ఇలాంటి వారు ఉన్నారు. ప్రేమ కోసం నిరీక్షించే శాబ్దిక ఛాయలు కూడా ఉన్నాయి. ఉండాలి కూడా ! అలాంటి ప్రేమ అనుభూతి. ఆ అనుభూతి ఓ అతిథి..స్వీకరించాల్సినంత స్వేచ్ఛ, కావాల్సినంత పరిణితి, నేర్చుకోదగ్గ పరిణామ గతి ఈ మార్నింగ్ రాగా మీకు ఇస్తుంది…అందుకోండి. సమాదరించండి. ప్రతిరోజూ నినదించే ఉదయాలకు సరిపడనంత బాధ్యత..రాత్రి నుంచి ఉదయం వరకూ
ఎగసిన కొన్ని విస్ఫోటనాల కూడిక..అడవే కాదు ఈ మార్నింగ్ రాగా కూడా నిబద్ధాక్షరి..ఆ విరాట పర్వం కూడా నిబద్ధాక్షరి.
నిషిద్ధాల చెంత నిబద్ధాక్షరి అని రాయాలి నేను..ఆనందించేను నేను. ఆనందించాలి మీరు..కవిత్వాన్ని ప్రేమిస్తూ సినిమా తీయడం ఒక సులువు సూత్రానికి అందని పని! కానీ కవిత్వానికి నేపథ్య గొంతుకలు ఇచ్చి కొన్ని దృశ్యాలను హృదయగతం చేయించిన తీరు చాలా బాగుంది. ఆ మట్టి పొరల్లో ఇంకా ఏవో రాసుకున్నవి, రాయాల్సినవి ఉండే ఉంటాయి..వెలికితీతతో ఒక సమాజం లేదా సమూహం పొందిన త్యాగం, స్వీకరించిన వరం, చేయాల్సిన యుద్ధ ప్రకటన ఇంకా అక్కడే..ఆ..అమరుని స్థూపం దగ్గరే ! ఊళ్లోకి వస్తే అమరుడు స్వాగతిస్తాడు.. అమ్మ మాట నాకో నేపథ్య గొంతుక..అలానే ఈ సినిమాకు కూడా ! వేణూ సర్ ! మీకో కృతజ్ఞత మరియు ఓ ధన్యవాద.
మాట్లాడినంత, మాటకు స్వేచ్ఛ ఇచ్చినంత మాటల నుంచి మౌనం వరకూ ఓ మనిషి తెగువ మరియు పోరాటం చూసినంత ..ఇవన్నీ కలిస్తే స్వాప్నికం..ఇవన్నీ విడదీసి చూస్తే వస్తువైక ప్రపంచం..మనిషి వినిమయంలో ఉంటాడు. ప్రేమ వినిమయంలోనూ ఉంటుంది. ప్రేమైక భావనలకు అనంతం అనేది ఓ తోడు కనుక ఈ వినిమయం వీలున్నంత వరకూ గుర్తింపులో ఉండదు. కొన్నిసార్లే ప్రేమ దైవం.. ప్రేమను మించిన దైవం విప్లవం కావొచ్చు..అడవి కథ..అడవి నుంచి వినిపించిన ఒగ్గు కథ..జీవిత ధార విరాట పర్వం.
కొన్నంటే కొన్నే టైటిల్ రాసినప్పటి నుంచి నచ్చుతాయి. సిన్సియర్ అంటే ఎలా ఉంటాడు..కవితా వస్తువు క్రమణిక అన్నది ఎలా ఉంటుంది. ముఖ్యంగా జీవితేచ్ఛలకు ఆలంబనలు వెతికి రాసిన సినిమా. మనం ఒక త్యాగం నుంచి అమరత్వం వరకూ ప్రయాణించి అలసి,సొలసి మరిచిపోయిన విప్లవ రచయితల సంఘం క్లుప్తంగా వి.ర.సం. ఓ విరాట పర్వం కావొచ్చు.. ఓ పౌర హక్కుల సంఘం కూడా విరాట పర్వం కావొచ్చు..కానలకేగిన కథ కానరాకుండా పోయిన కథ కావొచ్చు. ఈ పచ్చిక కాంతుల్లో
ఆ నెత్తుటి చినుకుల్లో ప్రేమ కన్నా మించిన శక్తి, అద్వైత కాంతి జీవితాన్ని నింపి ఉంచిన ప్రేమది కావొచ్చు. నటిగా వెన్నెల పాత్రధారి (సాయి పల్లవి) బాగుంది. జీవితేచ్ఛలూ, ఇష్టపూర్వక కోరికల వెల్లడిలో చాలా బాగుంది. మంచి ప్రయత్నాల కూడిక లేదా కూడలి ఓరుగల్లు దారుల్లో..నా తెలంగాణ పల్లెల్లో..రాసుకున్న కవితాత్మక వస్తువు.. ఇంకా చెప్పాలంటే నెత్తుటి చారల కింద ప్రాణం ఉనికి కూడా ఈ విరాటపర్వమే !
– రత్నకిశోర్ శంభుమహంతి