ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ఆగమనం కొంత ఆలస్యమైంది. అయితే మామూలు ప్రజలకు ఇది ప్రభావం చూపకపోయినా రైతుల్లో మాత్రం ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. ఎందుకంటే.. ఏరువాకకు సిద్ధమవుతున్న రైతన్నలు నైరుతి రుతుపవనాలపైనే ఆధరాపడుతుంటారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో తప్ప నైరుతి రుతుపవనాలు దేశంలోని మిగతా భాగాల్లో ఏమంత ప్రభావం చూపడంలేదు. ఈ నేపథ్యంలో, నైరుతి రుతుపవనాల విస్తరణపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా సమాచారం వెల్లడించింది.
రుతుపవనాలు నేడు మధ్యప్రదేశ్ లోని చాలా భాగాల్లోకి, చత్తీస్ గఢ్, కోస్తాంధ్ర, వాయవ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి, ఒడిశా మొత్తానికి, పశ్చిమ బెంగాల్ గంగా పరీవాహక ప్రాంతానికి, ఝార్ఖండ్, బీహార్ లోని చాలా ప్రాంతాలకు, ఉత్తరప్రదేశ్ నైరుతి భాగానికి విస్తరించినట్టు ఐఎండీ వివరించింది. వచ్చే రెండ్రోజుల పాటు ఉత్తర, మధ్య, తూర్పు భారతంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ.