రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలపై ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీసీలకు బీజేపీలోనే న్యాయం జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా తమ పార్టీలోనే ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైన చోట సీనియర్లు కూడా పోటీలో నిలుస్తారని చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో బీజేపీ తొలి జాబితా విడుదలవుతుందన్నారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. డబ్బున్నవారికి, అవినీతిపరులకు బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చిందన్నారు. బీజేపీ జాబితా వస్తుందనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఆదరాబాదరాగా అవినీతిపరులైన సిట్టింగ్‌లతో జాబితాను ప్రకటించారన్నారు. అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ మార్చలేదంటే డొల్లతనం బయటపడుతోందన్నారు. తాము మాత్రం షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.