ఏపీ సీఎం జగన్పై వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి మండిపడ్డారు. అమరావతి అనే మహాయజ్ఞంలో మారీచుడైన సీఎం జగన్‌కు ఇతరులంతా మారీచుల్లానే కనిపిస్తున్నారని విమర్శించారు. తాను మారీచులతో యుద్ధం చేస్తున్నానని జగన్ అంటున్నారని, ప్రజలు యుద్ధం చేయాలనుకుంటున్నది అసలు మారీచుడైన జగన్‌తోనేనని అన్నారు.
ప్రజలు మారీచుని మాటలు నమ్మవద్దని, హైకోర్టును అపార్థం చేసుకోవద్దని రఘురామ కోరారు. అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ప్రధానన్యాయమూర్తి కొట్టేసినా బాగుండేదని, వాయిదా వేయడం వల్ల సుప్రీంకోర్టులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు.
“విశాఖే రాజధాని అని చెబుతున్న ముఖ్యమంత్రి, త్వరలోనే తానూ అక్కడికే వెళ్తానంటూ.. రాష్ట్రం నలుమూలల వారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం. సీఎం జగన్ నిర్వహించిన ప్రజా ప్రతినిధుల సమావేశానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రులు కొడాలి నాని, ఆళ్ల నాని, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరుకాకపోవడం ఒక ఎత్తయితే సకల శాఖమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కాకపోవడం మహాలోటు” అని రఘురామ ఎద్దేవా చేశారు.