అబుధాబిలో ఆదివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 27వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఢిల్లీ ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై తడబడినట్లు కనిపించింది. కానీ ఆ జట్టు బ్యాట్స్‌మెన్ కుదురుగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ క్రమంలో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌లు రాణించారు. 52 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో ధావన్ 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే అయ్యర్ 33 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్‌కు 1 వికెట్ దక్కింది. మరొక వికెట్ రనౌట్ రూపంలో లభించింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ముంబై 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో క్వింటన్ డికాక్, సూర్య కుమార్ యాదవ్‌లు అర్థ సెంచరీలు చేశారు. డికాక్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చయగా, యాదవ్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 53 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో రబాడా 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, అశ్విన్, స్టాయినిస్‌లకు తలా 1 వికెట్ దక్కింది.