అక్కడ గెలిస్తేనే ఆయనకు మినిస్టర్ చాన్స్

-

మంత్రి పదవి పై మరో సారి ఆశలు పెట్టుకున్న ఆ మాజీ మంత్రికి సొంత ఇలాకాలో మున్సిపల్ ఎన్నికల టెన్షన్ మొదలైంది. సొంత మున్సిపాలిటిని గెలిస్తే కాబినేట్ హోదా, లేకపోతే అంతే సంగతులన్న అంచనాతో మాజీ మంత్రిలో కలవరం మొదలైంది. అదే ఎన్నిక పై కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి కూడా దృష్టిసారించడంతో పాలమూరు జిల్లా జడ్చర్ల మున్సిపల్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా క్లీన్ స్వీప్ చేస్తామని గులాబీ పార్టీ నేతలు పైకి చెబుతున్నా స్థానిక అధికార పార్టి నేతలను మాత్రం కలవర పెడుతున్నాయి. దుబ్బాక , గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో ప్రజానాడి అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. మరో పక్క తొలిసారి జరిగే జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటున్నారు విపక్ష కాంగ్రెస్ , బిజెపీలు . దుబ్బాక, జిహెచ్ ఎంసి ఎన్నికల తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో జడ్చర్ల స్థానిక పోరు నువ్వా నేనా అన్నట్లు మారే అవకాశం కనిపిస్తోంది.

జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి, వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. స్థానిక నేతలతో పార్టీ కిక్కిరిసినా, విపక్ష నేతలకు గులాబీ కండువాలు కప్పేస్తున్నారు. పురపోరులో క్లీన్ స్వీప్ చేసి మరోసారి మంత్రి పదవో , లేక క్యాబినేట్ హోదానో దక్కించుకునే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉండి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డాగా ఉన్న జడ్చర్ల మున్సిపాలిటీపై జెండా ఎగురవేసేందుకు అధికార పార్టీతో పాటు అదే స్థాయిలో విపక్ష పార్టీలు ఉవ్వీళ్లూరుతున్నాయట.

2012 లోనే జడ్చర్ల పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు అప్పటి ప్రభుత్వాలు పూనుకున్నా, విలీన గ్రామాల ప్రజలు కోర్టుకెక్కడం వంటి కారణాలతో ఇప్పటి వరకు జడ్చర్ల మున్పిపాలిటీకి ఎన్నికలు జరగలేదు.అటు బిజెపి నేతలు జితేందర్ రెడ్డి, డికే అరుణతో పాటు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ లు కూడా జడ్చర్ల పై స్పెషల్ ఫోకస్ పెట్టారట. దుబ్బాక , జిహెచ్ ఎంసి ఫలితాలు పునరావృతం చేస్తామంటున్నాయి బిజెపి శ్రేణులు.

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి , రేవంత్ రెడ్డి జడ్చర్ల మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి సారించి క్యాడర్ ను ఎన్నికలకు సమాయాత్తం చేస్తున్నారట. ఎన్నికల బాద్యత రేవంత్ రెడ్డి కి అప్పగిస్తారనే చర్చ స్థానిక హస్తం పార్టి శ్రేణుల్లో జరుగుతోంది. జడ్చర్ల మున్పిపాలిటీలో బరిలో నిలవాలనుకునే ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. పైగా ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు, మున్సిపాలిటీలో పడకేసిన అభివృద్ది అన్నీ కలిసి గులాబీ పార్టి గెలుపును ప్రభావితం చేయనున్నాయి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల పై మాజీ మంత్రి గంపెడాశలు పెట్టుకున్నారు..ఏంజరుగుతుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news