మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ను ఆయా పోలింగ్ స్టేషన్లలో సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. అంతకు ముందు మాక్ పోలింగ్‌ను నిర్వహించారు. చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా.. 2.41లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,720 మంది పురుష, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే.. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 1,44,878 ఓట్లు పోల్ అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అయితే తాజాగా.. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 ఓట్లు పోలింగ్ అయ్యాయి. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు మరో గంట మాత్రమే మిగిలింది. చివరి గంటలో భారీగా పోలింగ్ శాతం పెరగనుంది. ఇప్పటికే చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో నిల్చున్నారు. దీంతో.. 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు అధికారులు. చివరి నిమిషం వరకు ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న వారికి ఎన్నికల సిబ్బంది టోకెన్స్ ఇవ్వనున్నారు.