దేవీ శ్రీ ప్రసాద్.. ఈ పేరు వింటే తెలుగు సినీ ప్రేక్షకులకు వచ్చే వైబ్స్ వేరు! తన పాటలతో, సంగీతంతో అభిమానుల్లో ఎనర్జీని నింపే టాలెంటెడ్ మ్యూజిక్ డైరక్టర్‌గా.. ఇప్పటికే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవీ. మాస్ అయినా, మెలొడీ అయినా.. దేశీ అయినా, వెస్ట్రన్ అయినా.. నాటు అయినా, బీట్ అయినా.. ఐటెమ్ పాటకి అసలైన నిర్వచనం చెప్పాడీ రాక్‌స్టార్ డీఎస్పీ. నేడు ఈయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..
సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ తొలిచిత్రం ‘దేవి'(1999). చాలామంది అనుకుంటున్నట్లు ఆ టైటిల్ కారణంగా ఆయనకి ఆ పేరు రాలేదు. ఆయన అమ్మమ్మ, తాతయ్యల పేర్లను కలిపి ఆయనకు ‘దేవీశ్రీప్రసాద్’ గా చిన్నతనంలోనే నామకరణం చేశారు. ఆయన పూర్తి పేరు ‘గొర్తి దేవిశ్రీప్రసాద్’. తూర్పుగోదావరి జిల్లా వెదురుపాక ఆయన స్వస్థలం.
దేవిశ్రీప్రసాద్ తండ్రి గొర్తి సత్యమూర్తి దాదాపు 100సినిమాలకు పైగా కథ, సంభాషణలు అందించారు. అభిలాష, ఛాలెంజ్, పెదరాయుడు, చంటి లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
అభిమానులు దేవీశ్రీని ‘రాక్‌స్టార్’గా పిలుచుకుంటారు. తెలుగు చిత్రాలతో కలిపి దాదాపు 100 చిత్రాలకు పైగా ఆయన సంగీతమందించారు. సంగీత దర్శకుడిగానే కాకుండా, గాయకునిగా 60పాటలు పాడారు. దాదాపు 20పాటలకు సాహిత్యమందించారు.
సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డులు, అయిదు సైమా అవార్డులు, ఒక్క నంది అవార్డు అందుకున్నారు. ఇంకా తన కెరీర్‌లో ప్రేక్షకులతో విజిల్స్ వేయించి, సంవత్సరం మొత్తానికి ‘హిట్ ఆల్బమ్’లుగా నిలిచిన చిత్రాలెన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి.
దేవీశ్రీప్రసాద్ కుమారి ’21ఎఫ్'(2015) చిత్రంలో ‘బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్’ పాటకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఒక పాటకు ఆయనే సంగీతమందించి, ఆలపించి, నృత్యాన్ని సమకూర్చడం అదే తొలిసారి. అంతే కాకుండా ఎనిమిది చిత్రాలలో అతిథి పాత్రలో కనిపించారు.
సంగీత దర్శకుడు కాకముందు దేవీశ్రీప్రసాద్ మాండరిన్ శ్రీనివాస్ దగ్గర శిష్యరికం చేశారు. అయనతో పాటు దేవీశ్రీకి బాగా నచ్చే సంగీత దర్శకుడు ఇళయరాజా, నచ్చే వ్యక్తి మైఖెల్ జాక్సన్. సంగీత ప్రపంచంలో ఈ ముగ్గురిని ఆరాధిస్తానని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు.
‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’(2003) ఆల్బమ్ భారీ విజయం సాధించినపుడు, ఒక విజయోత్సవ సభలో మెగాస్టార్ చిరంజీవి దేవీశ్రీ ప్రసాద్‌ని ప్రశంసించి వాచీ బహుకరించారు. తనకు లభించిన అతి పెద్ద ప్రశంస గా డీఎస్‌పీ దాన్ని ఇప్పటికీ పేర్కొంటారు.
2000-2010 మధ్య కాలంలో అత్యధిక చిత్రాలకు మ్యూజిక్ అందించిన దర్శకుడిగా దేవిశ్రీకి రికార్డుంది. దాదాపు ఆ దశాబ్దంలో యాభై చిత్రాలకు పైగా సంగీతం అందించారు. అప్పట్లో సౌతిండియాలో అత్యధిక పారితోషికం తీసుకున్న సంగీత దర్శకుడు దేవీశ్రీనే. ఆ సమయంలోనే ‘రాక్‌స్టార్’ అనే ట్యాగ్‌లైన్‌ను అభిమానులు అతనికందించారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ రచయితగా, దిల్‌రాజు సమర్పణలో దేవిశ్రీ హీరోగా 2019లో ఒక కథ సిద్ధమయ్యింది. అయితే చర్చల దశలోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు, మ్యూజిక్ వీడియోల ద్వారా దేవీశ్రీప్రసాద్ నటుడిగానూ ప్రేక్షకులకు సుపరిచితమే.
‘ప్రత్యేక పాట’లకు సంగీతం అందించడంలో దేవీశ్రీ కి ‘ప్రత్యేక’మైన పేరుంది. ఎక్కువ ఐటెమ్ సాంగ్స్‌కు సంగీతం అందించిన దర్శకుడిగా ‘కింగ్ ఆఫ్ ఐటెమ్ నంబర్స్’ అని రాక్‌స్టార్ దేవీశ్రీని పిలుస్తారు. ఈయన సంగీతమందించిన ఐటెమ్ సాంగ్స్ చాలా పాపులారిటీని సంపాదించాయి.
‘ఆర్య2’లోని ‘రింగ రింగ’ పాటని అన్ని భాషల్లో రీమేక్ చేశారు. ఇంకా ఆ అంటే అమలాపురం, కెవ్వుకేక, డియ్యాలో డియ్యాలో విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఇటీవల దేశవ్యాప్తంగా వినిపించిన ‘ఊ అంటావా మామా’ పాట దేవీశ్రీ స్వరపరిచిందే.
‘స్పెషల్ కాన్సెర్ట్’ పేరిట విదేశాల్లో దేవిశ్రీ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2014 జులై 26న ఇల్లినాయిస్‌లోని అరెనాలో దేవిశ్రీ ఇచ్చిన సంగీత ప్రదర్శనకుగాను, ఆ రాష్ట్ర గవర్నర్ ఆ రోజును ‘డీఎస్పీ డే ఇన్ ఇల్లినాయిస్’గా ప్రకటించారు. ఆ అరుదైన గౌరవం దక్కించుకున్న సంగీతకారుల్లో దేవిశ్రీప్రసాద్ ఒకరు.
ఇవే కాకుండా ‘జీ తమిళం’లో ప్రసారమయ్యే ‘రాక్‌స్టార్’ కార్యక్రమానికి దేవీశ్రీ ప్రధాన న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. 2021లో ప్రారంభమైన ఈ కార్యక్రమం సీజన్1 ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఓటీటీ వేదికగా జీ5 లో ప్రస్తుతం ప్రసారం అవుతోంది. టెలివిజన్ వేదికగా ప్రసారమయ్యే సంగీత ప్రధాన కార్యక్రమాలకు డీఎస్పీ అతిథిగా హాజరయ్యారు. అందులో ‘పాడుతా తీయగా’ లాంటి ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమాలు ఉన్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అగ్ర హీరోలందరికీ మ్యూజిక్ అందించిన రికార్డు దేవిశ్రీకి ఉంది. ఇంకా వారి వారసుల సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్ అందించడం విశేషం. ఇలా రెండు తరాలకు సంగీతం అందించిన అతి కొద్దిమంది తెలుగు సంగీత దర్శకుల్లో ఆయనొకరు. సుమారు రెండు దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తూ దేవిశ్రీ ప్రసాద్ ప్రస్థానం సాగుతోంది.