ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ నాటకాలకు యువత బలవుతోందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాయమాటలు నమ్మి యువత మోసపోయిందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీనే ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏదని లోకేశ్ నిలదీశారు. జగన్ పాలనలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఒక్క ప్రకటన కూడా రాలేదని స్పష్టం చేశారు. ఏటా రెండు లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నారని, కానీ ఉద్యోగాలు రాక, ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉందని తెలిపారు.
ఉద్యోగాలు రాలేదని యువత అఘాయిత్యాలకు పాల్పడవద్దని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. మరో 6 నెలలు ఓపికపట్టండి… టీడీపీ ప్రభుత్వం వస్తుంది… యువత ఉద్యోగ, ఉపాధికి టీడీపీ భరోసా ఇస్తుంది అని ఉద్ఘాటించారు. ఇదిలా ఉంటే.. తెదేపా – జనసేన జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు అయింది. మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభి.. జనసేన పార్టీ నుంచి వర ప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కమిటీలో ఉన్నారు. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై కమిటీ భేటీ కానుంది.