గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆగ్రహం వెనుక లోకేష్ కుట్ర ఉందా ? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా ఇబ్బంది పడుతున్న పార్టీకి వంశీ ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. కాళ్ళు మొక్కిన వ్యక్తి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని చంద్రబాబు నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఆవేదన వ్యక్తం చేయడం చూస్తున్నాం. సోషల్ మీడియాలో వంశీ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు అభిమానులు పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు. వీటిపై వంశీ ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.
తనపై టీడీపీ అభిమానులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవి అన్నీ మార్ఫింగ్ ఫోటోలు అని ఆయన ఆరోపిస్తున్నారు. వాటిల్లో కొన్ని మాత్రం మార్ఫింగ్ అనేది స్పష్టంగా అర్ధమవుతోంది. అసలు దీని వెనుక ఒక పెద్ద తలకాయ ఉంది అనేది వంశీ అభిమానుల ఆరోపణ. ఆ తలకాయ నారా లోకేష్ అని అంటున్నారు. ఎప్పుడో అదుర్స్ సినిమా షూటింగ్ జరిగితే ఆ సినిమా హీరోయిన్‌తో వంశీకి అఫైర్ ఉందని ప్రచారంలోకి తీసుకొచ్చారు. దీనిపై వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదు చేశారు.
ఇక కొన్ని ఫోటోల వెనుక కూడా వంశీ అంటే గిట్టని, వైసీపీ నేతలు, టీడీపీ నేతలు కుట్ర చేశారని, ఒంగోలు, హైదరాబాద్ లో ఫోటోలను మార్చారని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వంశీని లోకేష్ పర్సనల్ గా ముందు నుంచి టార్గెట్ చేస్తున్నారు అనే భావన వంశీతో పాటు ఆయన అనుచరుల్లో ఉంది. వంశీ కూడా పలు మార్లు తాను చంద్రబాబు ఉన్నంత వరకే పార్టీలో ఉంటాను ఆ తర్వాత ఉండను అని చెప్పారట. కానీ ఇప్పటి పరిస్థితులతో వంశీ పార్టీని వీడారు. లోకేష్ పీఏ ఒకరు దీని వెనుక ఉన్నారని… వంశీ వర్గం ఆరోపిస్తుంది. ఏదేమైనా వంశీ వివాదం ఎప్పటకి సమసిపోతుందో ? గాని అప్పటి వరకు దీనిపై మీడియాకు కావాల్సినంత హాట్ న్యూస్ దొరుకుతోంది.