పేదపిల్లలకి ప్రభుత్వ విద్యని దూరం చెయ్యొద్దంటూ సీఎం జగన్‌కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. జాతీయ విద్యావిధానం, పాఠశాలల విలీనంతో పేదపిల్లలకి ప్రభుత్వ విద్య దూరం చేయొద్దు. పాఠశాలల ప్రారంభం రోజునే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా తగిలిందని లేఖలో లోకేష్ పేర్కొన్నారు.
ఆగమేఘాలపై జాతీయ విద్యా విధానం అమలు, పాఠశాలల విలీనంపై తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థుల్ని ప్రభుత్వ విద్యకి దూరం చేస్తోంది… ఇప్పటికే ఉపాధ్యాయులు కొరత, అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ విద్యాలయాలు కునారిల్లుతున్నాయన్నారు. పాఠశాలల విలీన నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని.. జాతీయ విద్యా విధానం అమలుని ఇంకా ఏ రాష్ట్రం మొదలు పెట్టకుండానే ఏపీలో ప్రారంభించేశారని తెలిపారు.
సమస్యలపై ఎటువంటి అధ్యయనం లేకుండా మన రాష్ట్రంలో ఆరంభించడం వల్ల బడికి దూరమైన విద్యార్థులు రోడ్డున పడటం చూశామని.. ఎన్ఈపీ సూచనల మేరకు కరికులమ్, బోధనా విధానాలు అమలు కోసమే పాఠశాల విద్యను నాలుగు స్థాయిలుగా విభజించారని పేర్కొన్నారు. అయితే పాఠశాలలను విభజించాల్సిన అవసరంలేదని కేంద్రం స్పష్టం చేసినా పట్టించుకోవడం లేదని… పాఠశాలలను విభజించడంతో సమస్య తీవ్రమైందని ఫైర్ అయ్యారు. జాతీయ విద్యావిధానం అమలు చేసే తొందర కంటే పాఠశాలలు, ఉపాధ్యాయులని తగ్గించే ఆతృత ప్రభుత్వంలో కనిపిస్తోందన్నారు.