బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయనకి మెరుగైన చికిత్స అందించేందుకు పాట్నా నుంచి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తన నివాసంలో మెట్లపై నుండి పడిపోవడంతో ఆయన కుడి భుజం ఎముక విరిగింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని ఫారస్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిడ్స్ కి తీసుకెళ్లినట్లు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు.
ఇప్పటికే తీవ్రమైన కిడ్నీ వ్యాధితో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూప్రసాద్ ని ఎయిమ్స్ లో చేర్చామన్నారు. అవసరమైతే చికిత్స కోసం సింగపూర్ తరలిస్తామని వెల్లడించారు. ఇక లాలూ చికిత్సకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. బుధవారం పాట్నాలోని ఫారాస్ హాస్పిటల్ కి వెళ్లి లాలూని ఆయన పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. లాలూ ప్రసాద్ యాదవ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.