సీఎం జగన్ కు నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. వైసీపీకి ఓటు వేయడమే పాపమా ? అంటూ లేఖలో మండిపడ్డారు. గిరిజనులకు సంక్షేమ పథకాలు దూరం చేసే అడ్డగోలు నిబంధనలు సవరించి ..ఆపేసిన పెన్షన్, రేషన్, సంక్షేమపథకాలు పునరుద్దరించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసానన్నారు నారా లోకేష్. మీకు ఓట్లు వేయడమే గిరిజనులు చేసిన పాపమా ? అంటూ ఫైర్ అయ్యారు.
అడ్డగోలు నిబంధనలతో ఆదివాసీలకు సంక్షేమ పథకాలు అందకుండా దూరం చేయడం మీకు న్యాయమా? తలకుమించిన అప్పులతో సంక్షేమపథకాలు కోత వేయాలనే ఆలోచనతో కనీస అధ్యయనం లేకుండా మీరు తెచ్చిన నిబంధనలు వేలాదిమంది గిరిజనుల జీవనాధారమైన పింఛను, రేషన్‌ని దూరం చేస్తున్నాయన్నారు. నిరక్షరాస్యులైన ఆ గిరిజనులు తమకి రేషన్ బియ్యం ఎందుకివ్వడంలేదో, పింఛను ఎందుకు ఆపేశారో తెలియక…కొండలపై నుంచి దిగి రాలేక…ఆకలితో, ఆవేదనతో కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు సంక్షేమపథకాల అర్హత నిబంధనలను సవరించి కొత్త జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.