ఈనెల 14వ తేదీన మంత్రి రోజాకు చీర, గాజులు ఇచ్చేందుకు తెలుగు మహిళలు రోజా ఇంటికి వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రోజా ఇంటికి చీర, గాజులు ఇవ్వడానికి వెళ్లి అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన చిత్తూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అరుణ, మహిళా కార్యకర్తలకు చీర, గాజులు ఇచ్చి నమస్కరించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
తిరుపతి లోని సత్యవేడు నియోజకవర్గం తిమ్మనాయుడుగుంట గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. గట్టిగా పోరాడారు అంటూ మహిళా కార్యకర్తలను అభినందించారు. మహిళా కార్యకర్తలపై పోలీసులు చెయ్యి చేసుకోవడం దారుణం అని మండిపడ్డారు. తెలుగు మహిళలు చేసిన తప్పేంటి? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న మంత్రి రోజా ఇంటికి చీర, గాజులు ఇవ్వడానికి వెళ్ళడం నేరమా? అని నిలదీశారు.
దళిత మహిళల పై పోలీసులు చేయి చేసుకొని, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దారుణం అన్నారు నారా లోకేష్. తప్పుడు కేసులు బనాయించారు కాబట్టే బెయిల్ వెంటనే వచ్చిందన్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధించిన వారిని వదిలి పెట్టనని హెచ్చరించారు. త్వరలో ఆటో డ్రైవర్ హమీద్ బాషా కి ఆటో కూడా అందజేస్తానని తెలిపారు.