2019సంవత్సరానికి గాను జాతీయ సినిమా అవార్డుల ప్రకటన వచ్చేసింది. తెలుగు నుండి రెండు సినిమాలకి రెండేసి అవార్డుల చొప్పున నాలుగు అవార్డులు వచ్చాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జెర్సీ చిత్రం నిలవగా, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా మహర్షి అవార్డు అందుకుంది. అంతా బాగానే ఉంది కానీ మరో తెలుగు సినిమా అయిన మల్లేశం సినిమాకి ఏ అవార్డు రాకపోవడం చాలా మంది సినిమా అభిమానులని బాధించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మల్లేశం సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో కనిపించాడు. అనన్య నాగళ్ళ హీరోయిన్ గా కనిపించింది. ఆసు యంత్రాన్ని కనిపెట్టిన మల్లేశం జీవిత కథని, అది కనిపెట్టడానికి ఆయన పడ్డ ఏడేళ్ళ శ్రమని చాలా అద్భుతంగా తెర మీదకి తీసుకొచ్చారు రాజ్ ఆర్.
తెలంగాన ప్రాంత నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాకి థియేటర్లలో స్పందన అంతగా రాకపోయినా, విమర్శకులను మెప్పించింది. ఒక మధ్యతరగతి యువకుడు, చదువు లేకుండా వాళ్ళ అమ్మ కష్టాన్ని తీర్చడానికి ఆసు యంత్రాన్ని కనిపెట్టిన కథని, చాలా హృద్యంగా చూపించారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయారు. అంతకు ముందు అన్నీ కమెడియన్ పాత్రలే చేసినప్పటికీ, మల్లేశం సినిమాలో మరో లెవెల్లో తన నటన కనబరిచారు. ఎక్కడా కూడా పాత్ర పరిధి దాటి వెళ్ళకుండా, అద్భుతంగా నటించారు.
మధ్య తరగతి కుటుంబాలు కూడా ఎంతో సాధించవచ్చని చాలా అందంగా వినోదాత్మకంగా చూపించిన సినిమాకి జాతీయ అవార్డు రాకపోవడం ఒకింత ఆశ్చర్యంగా ఉందని సోషల్ మీడియా వేదికగా చర్చలు జరుగుతున్నాయి. మార్క్ కె రాబిన్ అందించిన సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. సినిమా చూస్తున్నంత సేపు పల్లెటూళ్ళో తిరుగుతున్న భావన కలుగుతుంది. అంత మంచి సినిమాకి అందులో నటించిన వాళ్ళకి, దానికి పని చేసిన సాంకేతిక బృందానికి పురస్కారం దక్కి ఉంటే బాగుండేదని, మధ్య తరగతి కుటుంబాల నుండి ఉన్నత ఎత్తుకి ఎదిగిన మరెందరో జీవితాల కథలు తెర మీద ఆవిష్కృతం అయ్యేవని చెప్పుకుంటున్నారు. మల్లేశం సినిమాలో అనన్య నాగళ్ల హీరోయిన్ గా కనిపించింది.