ఇప్పుడు అందరి ఇళ్లలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పెరిగిపోయాయి. ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్..ఒక్కోదానికి ఒక్కో ఛార్జర్.. ఒక్కోసారి దేనికి ఏ ఛార్జర్ అని మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం.. ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా అన్నీ తీసుకెళ్లాలి.. ఇంకా కొత్తఫోన్లు కొన్నప్పుడు ఈ ఛార్జర్లు అలానే ఉండిపోతాయి. దీని కారణంగా ఈ వేస్ట్ బాగా పెరిగిపోతుందని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎలక్ట్రిక్ పరికరాలన్నీ ఒకే చార్జర్‌తో పనిచేసే విధానం దిశగా కేంద్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
కామన్ చార్జర్ తీసుకురావడంలో సాధ్యాసాధ్యాలు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడానికి నిపుణుల బృందం ఏర్పాటుకు సిద్ధమైందట.. ఒక్కో డివైజ్‌కు ఒక్కో రకం చార్జర్ కాకుండా, అన్నింటికీ ఒకే రకమైన చార్జర్ ఉండాలి బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో మొబైల్స్, ల్యాప్‌టాప్ తయారీదారులు, సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు, ఢిల్లీ ఐఐటీ, వారణాసి ఐఐటీ నిపుణులు పాల్గొన్నారు.
కొన్నింటికైనా..
అన్నింటికీ ఒకటే చార్జర్ కాకపోయినా.. తొలి దశలో రెండు రకాల చార్జర్ల విధానం అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నించడం మేలని రోహిత్ అన్నారు. ఇందులో సీ-టైప్ చార్జర్ కూడా ఒకటని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు యూజర్లు, తయారీదారుల వాదనల్ని అర్థం చేసుకోవాలని, వాటన్నింటిని పరిశీలించేందుకు నిపుణుల బృందం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మొబైల్స్, ఫీచర్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఐప్యాడ్స్, వేరబుల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్… ఇలా రకరకాల విభాగాల్లో అధ్యయనం కోసం వేర్వేరు నిపుణుల బృందాలను ఏర్పాటు చేసి… రెండు నెలల్లో నిపుణుల బృందాలు తమ నివేదికలను అందజేసేలా కార్యచరణ రూపొందిస్తున్నట్లు రోహిత్ వెల్లడించారు.
ఈ-వేస్ట్ వల్ల కలిగే దుష్పరిణామాల దృష్ట్యా.. అమెరికా, యూరోప్ ప్రభుత్వాలు ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లకు బ్రాండ్లతో సంబంధం లేకుండా ఒకటే చార్జింగ్ పోర్టు ఉండాలని తయారీ సంస్థలకు స్పష్టం చేశాయి. త్వరలోనే ఆ దిశగా కంపెనీలు మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. అయితే భారత్‌లో ఆ రూల్ లేదు కాబట్టి యాపిల్ వంటి సంస్థలు తాము ప్రత్యేకంగా రూపొందించిన లైట్‌నింగ్ పోర్ట్ చార్జర్లను మన దేశంలో ఎక్కువగా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆవిధంగా చూస్తే.. అమెరికా, ఐరోపా దేశాల్లో తగ్గిన ఈ-వేస్ట్ అంతా భారత్‌లోనే పోగుపడే ముప్పు లేకపోలేదు. దీని కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సాధ్యమైనంత త్వరగా కామన్ చార్జర్ విధానం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఉంది..