కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండడంతో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దూకుడు పెంచాయి. కర్ణాటకలోని మొత్తం 226 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కర్ణాటకలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తనదైన శైలిలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
కర్ణాటకలో ఒకవేల కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వరసత్వ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా పెట్రేగిపోతాయని, అవినీతి కట్టలు తెంచుకుంటుందని, రాష్ట్రం అల్లర్లతో అట్టుడుకుతుందని, ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. అయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రామ్ రమేష్. అమిత్ షా వ్యాఖ్యలు బెదిరింపుల్లాగా ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో ఓటమిని చూసి అమిత్ షా ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు 6.5 కోట్ల కన్నడిగులను అవమానించేలా ఉన్నాయన్నారు.