అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక ఆ రాష్ట్రంలో 22 జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఊర్లకు ఊర్లే చెరువులుగా మారిపోవడంతో దాదాపు 4లక్షల 96 వేల మంది వరదల్లో చిక్కుకుపోయారు.
అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం.. బజలి, బక్సా, బార్పేట, బిశ్వనాథ్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, డిబ్రూగఢ్, గోలాఘాట్, హోజాయ్, కమ్రూప్, కోక్రాఝర్, లఖింపూర్, నాగావ్, నల్బరి, సోనిట్‌పూర్, తముల్‌పూర్ జిల్లాల్లోని 58 రెవెన్యూ సర్కిళ్లలో ఉన్న 1366 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 3,46,639 పెంపుడు జంతువులు కూడా వరదల వల్ల ప్రభావితమయ్యాయి.
మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.