‘ఇది ఇండియా.. ఇంగ్లాండ్ కాదు.. ఎందుకు అతిగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు..?’ అని ఓ వ్యాపారవేత్తపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మండిపడ్డారు. వ్యవసాయానికి సంబంధించి బాపు సబాగార్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘నాలుగో వ్యవసాయ రోడ్‌మ్యాప్’ ప్రారంభ కార్యక్రమంలో వ్యవసాయ-పారిశ్రామికవేత్త అమిత్ కుమార్ సీఎం నీతీశ్‌ను ప్రశంసిస్తూ తన ఉపన్యాసాన్ని ఆంగ్లంలో ప్రారంభించారు. కొద్దినిమిషాల తర్వాత ముఖ్యమంత్రి ఆయన ప్రసంగాన్ని ఆపారు.‘‘
‘మీరు అతిగా ఆంగ్ల పదాలు మాట్లాడటం వల్ల నేను మధ్యలో జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఇదేమన్నా ఇంగ్లాండా? మీరు బిహార్‌లో ఎందుకు పని చేస్తున్నారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని మీరు అభ్యసిస్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ అనే బదులు సర్కారీ యోజన అనలేరా. నేనూ ఆంగ్ల మాధ్యమంలో ఇంజనీరింగ్ చదివాను. అది వేరే విషయం. రోజూవారీ కార్యకలాపాలకు ఆ భాషను ఎందుకు ఉపయోగించాలి’’’ అని వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలతో ఆ పారిశ్రామిక వేత్త ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే హిందీలో మాట్లాడారు.