బిజెపి పార్టీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ని అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారని ప్రధాని మోదీ రెండుసార్లు వివిధ సందర్భాలలో పేర్కొన్నారు. ఇటీవల మహారాష్ట్రలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ అర్బన్ నక్సల్స్ గ్రూప్ కాంగ్రెస్ ను నడుపుతోందని, ఆ పార్టీ ప్రమాదకర అజెండాను ప్రజలంతా కలిసికట్టుగా ఓడించాలని విమర్శించారు.
కాంగ్రెస్ కుట్రను భగ్నం చేసేందుకు ఏకం కావాలన్నారు మోదీ. మరోసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించిన తర్వాత అక్టోబర్ 9న మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అర్బన్ నక్సల్స్ అని, ఆ విద్వేషపూరిత కుట్రలకు తాము బలి కాబోమని ప్రజలు చూపించారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే.. బిజెపి టెర్రరిస్టుల పార్టీ అని ఫైర్ అయ్యారు.
మోడీ ఎప్పుడూ కాంగ్రెస్ ని అర్బన్ నక్సల్స్ పార్టీగా అభివర్ణిస్తారని.. అది ఆయనకు అలవాటేనన్నారు. అయితే ఆయన సొంత పార్టీ సంగతి ఏంటి..? అని ప్రశ్నించారు మల్లికార్జున ఖర్గే. బిజెపి ఉగ్రవాదుల పార్టీ, ఆ పార్టీ నేతలకు అనేక హత్యలతో సంబంధం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీపై ఇలాంటి ఆరోపణలు చేసే హక్కు మోడీకి లేదని అన్నారు ఖర్గే.