కరోనా సెకండ్ వేవ్ దేశంలో రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ వైద్య ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. పెద్ద ఎత్తున కోవిడ్ బాధితులు హాస్పిటళ్లకు వస్తుండడంతో వారికి చికిత్సను అందించడం కష్టంగా మారింది. అయితే కరోనా మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ లోనే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కరోనా మొదటి వేవ్ మార్చి 2020లో ప్రారంభం కాగా జూలై వరకు తీవ్ర దశకు చేరుకుంది. ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి చెందింది. అయితే ఫిబ్రవరి 2021లో కరోనా రెండో వేవ్ ప్రారంభం కాగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనే కోవిడ్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. మార్చిలో గ్రామీణ ప్రాంతాల్లో ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 34.3 శాతం ఉండగా పట్టణాల్లో 48.2 శాతం ఉంది. అయితే ఏప్రిల్ నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ఇన్‌ఫెక్షన్ల సంఖ్య కొంత పెరిగి 44.1 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో 40.8 శాతానికి చేరుకుంది.
మే నెలలో మొదటి నాలుగు రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కోవిడ్ కేసుల సంఖ్య 4.9 రెట్లు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 3.8 రెట్లుగా ఉంది. అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో టెస్టులు తక్కువగా చేస్తున్నారని, అందువల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉందని, కానీ టెస్టులను మరింత పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు.