దిల్లీ లిక్కర్ స్కాం ఎఫెక్ట్ అక్కడి అసెంబ్లీ పై పడింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించినట్లు అధికారులు వెల్లడించారు.
అనంతరం దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఇద్దరి రాజీనామా పత్రాలను పంపారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోదియా దిల్లీ ప్రభుత్వంలోని 33 శాఖల్లో 18 శాఖలకు బాధ్యతలు నిర్వహించేవారు. వీటిలో ఆరోగ్యం, ఆర్థికం, విద్య, హోం శాఖలతో సహా మొత్తం 18 శాఖలు ఉన్నాయి. తాజాగా సిసోదియా రాజీనామాతో ఆయన శాఖా బాధ్యతలను మంత్రివర్గంలోని రెవెన్యూ శాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.