దేశంలో ప్రస్తుతం కోవిడ్ మూడో వేవ్ కొనసాగుతున్న విషయం విదితమే. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ త్వరలో మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ మూడో వేవ్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ మూడో వేవ్ వస్తుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రజలు అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని గులేరియా అన్నారు. బయట అడుగు పెడితే కచ్చితంగా మాస్క్‌లను ధరించాలని, టీకాలను వేసుకున్నా, వేసుకోకపోయినా తప్పనిసరిగా మాస్కులను ధరించాలని అన్నారు. అలాగే భౌతిక దూరం పాటించాలని, సబ్బుతో చేతులను బాగా కడుక్కోవాలని అన్నారు.
పండుగ సీజన్ కనుక ప్రజలు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గులేరియా అన్నారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త అవసరమని అన్నారు. కోవిడ్ 19 కు చెందిన డెల్టా వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకాలను వేయించుకోవాలని గులేరియా అన్నారు. కరోనాను నివారించేందుకు టీకాలను వేయించుకోవడం ఒక్కటే మార్గమన్నారు. టీకా వేసుకుంటే కోవిడ్ ఒక వేళ వచ్చినా తీవ్రత చాలా తగ్గుతుందని, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని, కనుక కచ్చితంగా టీకాలను వేయించుకోవాలని సూచించారు.