మోడీ, అమిత్ షా తో భేటీ అయినా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ప్రధాని నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రపతి గా అవకాశం కల్పించినందుకు ద్రౌపదీ ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. కాగా ద్రౌపది ముర్ము ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని ఎమ్మెల్సీ గెస్ట్హౌస్ నుంచి విమానంలో బయలుదేరి డిల్లీ చేరుకున్నారు.

ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా జూన్ 24న ముర్ము నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ అభ్యర్థిత్వం కోసం ఆమె పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపాదించారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని అన్ని మిత్రపక్షాలు, మిత్రపక్ష పార్టీలోని ముఖ్య మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.