ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని జరగాలంటే ఈ మధ్య లంచం తప్పనిసరి అయింది. కొందరు అధికారులు పేద ప్రజలను కూడా లంచం కోసం పీడిస్తున్నారు. అలా ఓ అధికారి అడిగిన లంచం ఇచ్చేందుకు తన వద్ద డబ్బు లేక ఓ రైతు ఎద్దును తీసుకెళ్లాడు. డబ్బుకు బదులు ఎద్దును తీసుకుని తన పని చేయాలని వేడుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటక సీఎం సొంత జిల్లా అయిన హవేరీలో చోటుచేసుకుంది.
హవేరీ జిల్లాలోని సవనూర్ మున్సిపాలిటీకి చెందిన ఎల్లప్ప రానోజి అనే రైతు మున్సిపల్ రికార్డుల్లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పని జరగాలంటే లంచం ఇవ్వాలని అధికారులు ఎల్లప్పను డిమాండ్ చేశారు. ఎల్లప్ప లంచం ఇచ్చినా ఆయన పని చేయకుండానే ఆ అధికారులు బదిలీ అయ్యారు.
కొత్తగా వచ్చిన ఆఫీసర్లు కూడా ఎల్లప్పను లంచం అడిగారు. నిస్సహాయుడైన ఎల్లప్ప తన ఎద్దును తీసుకొని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. డబ్బుకు బదులు ఎద్దును తీసుకోవాలని అధికారులను కోరడంతో కార్యాలయ ఆవరణలో కలకలం రేగింది. స్పందించిన ఉన్నతాధికారులు.. ఎల్లప్పకు సంబంధించిన రికార్డుల్లో మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.