దీపావళి రోజున టపాసులు కాలిస్తే ఆరు నెలల జైలు.. ఎక్కడంటే..?

-

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ ఉన్న వాయువులో దాదాపు కాలుష్యమైందే ఎక్కువ. కాలుష్యాన్ని తగ్గించడానికి దిల్లీ సర్కార్ ఎన్నో చర్యలు చేపడుతోంది. అయినా ఎయిర్ పొల్యూషన్ దారికి రావడం లేదు. ముఖ్యంగా పండుగల సమయంలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ప్రధానంగా దీపావళి రోజున పొల్యూషన్ పీక్ కి వెళ్తోంది. అందుకే దీపావళి రోజున అధికారులు, దిల్లీ ప్రభుత్వం కాలుష్యం పెరగకుండా పటిష్ఠ చర్యలు చేపడుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా ఆ చర్యలు చేపట్టేందుకు దిల్లీ ప్రభుత్వం రెడీ అయింది.

దీపావళి రోజున బాణాసంచా పేలుస్తూ చిన్నాపెద్దా అంతా సందడిగా గడుపుతారు. అయితే ఇది కాసేపు హాయినిస్తుంది కానీ దీర్ఘకాలికంగా వాయు కాలుష్యం కలగజేస్తుంది. అందుకే దిల్లీ సర్కార్ కీలకనిర్ణయం తీసుకుంది. దీపావళి రోజున టపాసులు పేలిస్తే.. ఆరు నెలల జైలుశిక్ష విధించనున్నట్లు పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ హెచ్చరించారు. పటాకుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు చేపడితే రూ.5వేల జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు.

దీపావళితో సహా వచ్చే ఏడాది ఒకటో తేదీ వరకు అన్ని రకాల బాణాసంచా ఉత్పత్తి, అమ్మకాలు, విక్రయాలపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తూ సెప్టెంబర్‌లో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్లీ కాలుష్యం నేపథ్యంలో ఆ సర్కారు గత రెండేళ్లుగా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది. ఈ నెల 21న ‘దియే జలావో.. పటాఖే నహీ’ (దివ్వెలు వెలిగించండి.. టపాసులు కాదు) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు గోపాల్‌రాయ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news