తెలంగాణలో నాడు ఎండిన చెరువులు.. నేడు నిండుకుండల్లా మారాయని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నమైందని.. నేడు కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులు పునర్జీవం సంతరించుకున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం అయిందని వెల్లడించారు. అమృత్ సరోవర్‌గా మిషన్ కాకతీయ దేశవ్యాప్తంగా అమలవుతోందని చెప్పారు. ‘తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తుంది’ అని హరీశ్ రావు అన్నారు.
ఒకప్పుడు తడారిన నేలలతో ఇబ్బంది పడిన తెలంగాణ.. నేడు గోదారి పరవళ్లతో ‘జల తెలంగాణ’గా మారిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలోనే జలవిజయం సాధించిందని తెలిపారు. ‘నాడు ఎటు చూసినా తడారిన నేలలు.. నేడు ఎటు చూసినా పరవళ్లు తొకుతున్న గోదారి. నాడు ఎటుచూసినా నోళ్లు తెరిచిన బీళ్లు.. నేడు తలలూపుతున్న ఆకుపచ్చని పైర్లు. ఇది తెలంగాణ జలవిజయం.. కేసీఆర్ సాధించిన ఘన విజయం. మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు.. ఊటలు జాలువారుతున్న వాగులు.. పాతాళగంగమ్మ పైపైకి ఎగదన్నుతున్న జలదృశ్యాలు. ఇది కదా జల తెలంగాణ.. ఇది కదా కోటి రతనాల మాగాణ’ అని ట్వీట్ చేశారు.