రాజకీయ అవసరాల కోసం ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసను అనుమతించకూడదని కెనడాను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదని పేర్కొన్నారు. 78వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని ఉద్దేశించి జైశంకర్ ప్రసంగించారు. ‘నమస్తే ఫ్రమ్ భారత్’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశంపై ఇటీవల పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్-ఉల్-హక్ కాకర్ ఐరాసలో చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ మాట్లాడారు. మరోవైపు కెనడాతో దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో పరోక్షంగా ఇరు దేశాలపై విమర్శలు గుప్పించారు. భారత్ ‘అమృత్ కాల్’లోకి ప్రవేశించిందని జైశంకర్ ఉద్ఘాటించారు. చంద్రయాన్-3 తో ప్రపంచం భారత్ వైపు చూసిందని పేర్కొన్నారు.
భారత డిజిటల్ సహిత గవర్నెన్స్, సౌకర్యాలు, సేవలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు, శక్తివంతమైన అంకుర సంస్థలు నిర్మాణంలో ఉన్నాయని నేడు ప్రపంచానికి భారత్ సందేశం పంపుతోందని జైశంకర్ వెల్లడించారు. ప్రస్తుత సమకాలీన సమాజానికి తగ్గట్లుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారతదేశం ఉద్దేశం.. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు (వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్) అని.. ఏ కొందరి ప్రయోజనాల కోసం పాటుపడదని చెప్పారు.