మాటలతో కాకుండా.. పని తీరుతోనే ప్రజలకు విశ్వాసం కల్పిస్తానని అన్నారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్. సామాన్య ప్రజలకు సేవ చేయడమే తన మొదటి ప్రాధాన్యమని తెలిపారు. సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సుప్రీంకోర్టు ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. టెక్నాలజీ, రిజిస్ట్రీ, న్యాయవ్యవస్థలో.. ఇలా ఏ విభాగంలో సంస్కరణలు చేపట్టినా పౌరుల్ని దృష్టిలో ఉంచుకుంటానని వివరించారు.
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతితో పాటు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో లాంఛనంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కాకపోవడం గమనార్హం.
44 ఏళ్ల క్రితం తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేస్తే, ఇప్పుడు తనయుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి. కొత్త ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో సరిగ్గా రెండేళ్లు కొనసాగుతారు.