భారత్ లో ఈడీ అధికారులకు అసాధారణ అధికారాలు కట్టబెట్టారని సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే అన్నారు. వాటిని అదుపు చేయకపోతే ఎవరికీ భద్రత ఉండదని వ్యాఖ్యానించారు. గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీ మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కంపెనీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సాల్వే.. ఈడీ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘మన దేశంలో ఈడీకి అసాధారణమైన అధికారాలను ఇచ్చారు. కోర్టు వాటిని అదుపుచేయలేకపోతే.. దేశంలో ఎవరూ భద్రంగా ఉండలేరు. ఈ కేసులో ఎలా అరెస్టు చేశారో చూడండి. విచారణకు సహకరించినా.. అధికారులు అరెస్టు చేశారు. ఇది పూర్తిగా హక్కుల ఉల్లంఘనే. ముందస్తు బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లు ఎక్కడా ఆధారాల్లేవ్. అయినా, ఈడీ ఇలా దారుణంగా వ్యవహరించి అరెస్టుకు పాల్పడింది. ఈడీ అసాధారణ అధికారులు ఎప్పటికైనా భారతీయ ప్రజల భద్రతకు ముప్పే’’ అని హరీశ్ సాల్వే సుప్రీం కోర్టుకు విన్నవించారు.