మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం రోజుకోరకంగా మలుపు తిరుగుతోంది. ఈ పోరులో అంతిమ విజయం కోసం ఇరువర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. కాగా అస్సాంలోని గౌహతిలో హోటల్ లో ఉంటున్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ ఓ లేఖ రాశారు.” నేను మీకో విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఇప్పటికీ సమయం మించిపోలేదు. దయచేసి వచ్చేయండి. నాతో కూర్చుని మాట్లాడండి. శివసైనికుల, ప్రజల మనసులో ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేయండి.
శివసేన పార్టీ లో మీకు దక్కిన గౌరవం మరే ఇతర పార్టీలో దక్కదు. శివసేన పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు కూడా నేను మీ గురించి చింతిస్తున్నాను. ఎవరి ఉచ్చులోనూ మీరు పడద్దు” అని ఉద్ధవ్ ఠాక్రే కోరారు. కాగా ఎక్నాధ్ షిండే తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంటున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నేడు ఆయన ముంబైకి వెళ్లే అవకాశం ఉంది.