ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భక్తులకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇటు అధికారులు అటు నిర్మాణ కార్మికులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇప్పటికే మందిరానికి సంబంధించి 50 శాతం పనులు పూర్తయ్యాయి.
ఈ సంక్రాంతి రోజున ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 2024 జనవరిలో భక్తులు రామయ్యను దర్శించుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆలయ నిర్మాణం యావత్తూ సంతృప్తికరంగా సాగుతున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర మంగళవారం తెలిపింది.
“మకర సంక్రాంతి పర్వదిన సమయంలో గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించి, భక్తుల సందర్శనార్థం జనవరి 2024లో రామమందిరాన్ని ప్రారంభిస్తాం” అని దేవాలయ నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ వెల్లడించారు. కోవెల భూ అంతస్తు(గ్రౌండ్ ఫ్లోర్) వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందని అన్నారు. జనవరి 14న రాముడి విగ్రహాల ప్రతిష్ఠాపన జరుగుతుందని తెలిపారు. రామాలయ నిర్మాణానికి సుమారు రూ.1800 కోట్లు ఖర్చవుతాయని తెలిపారు.