ఒడిశాలోని కొత్త ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జెట్ స్పీడులో దూసుకెళ్తున్నారు. ఆయన కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు లక్ష మంది ప్రజలను కలిశారు. ఈ మేరకు భారీ సంఖ్యలో ప్రజలను కలిసినట్లు ఒడిశా సీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మహిళలు, పిల్లలు, వికలాంగులతో సహా లక్ష మంది కలిసినట్లు తెలిపింది.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రజలను కలిసేందుకు కేటాయిస్తే, ఉదయం 6 నుంచే క్యూలో ఉన్నారని సీఎం మోహన్ చరణ్ మాఝి వెల్లడించారు. గత ప్రభుత్వంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని తెలిపారు. అందుకే ప్రజలు బీజేపీకి ఓటు వేసి అధికారంలోకి వచ్చేలా చేశారని అన్నారు. 4.5 కోట్ల ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు. ఈ ఐదేళ్లలో రాబోయే 50 సంవత్సరాల పాటు ప్రభావం చూపేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి మాఝి పేర్కొన్నారు.