ఒడిశాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంజాం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సు పరస్పరం ఢీ కొన్నాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బ్రహ్మపురలోని MKCG ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్లు మద్యం మత్తులో ఉన్నారా లేక నిద్ర మత్తులో ఈ ప్రమాదం జరిగిందా.. లేదా అతివేగం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.