షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో పాల్గొనడానికి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ వచ్చిన విషయం తెలిసిందే. తన భారత్ పర్యటనపై భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో తన పర్యటన విజయవంతమైందని తెలిపారు. భారత గడ్డపై తమ దేశ వాదనను వినిపించామని చెప్పారు. గోవాలో జరిగిన ఎస్సీవో సదస్సులో పాల్గొన్న ఆయన.. శుక్రవారం తిరిగి పాకిస్థాన్ చేరుకున్నారు.
ప్రతీ ముస్లిం ఉగ్రవాది అనే అపోహను బద్దలు కొట్టే ప్రయత్నం చేశానని భుట్టో చెప్పారు. కశ్మీర్‌లో 2019 ఆగస్టు 5కు ముందు ఉన్న స్థితిని పునరుద్ధరించడం కోసం చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని భారత్ సృష్టించాలని ఆయన స్పష్టం చేశారు. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్‌లో భాగం కావాలని.. ఆసియా దేశాలు ఎదురు చూస్తున్నాయని ఆయన చెప్పారు. భారతదేశం మినహా ప్రతి దేశం సీపీఈసీకి మద్దతునిచ్చిందని ఆయన తెలిపారు.
మరోవైపు ఇదే సదస్సులో పాక్ మంత్రి సాక్షిగా.. భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ శుక్రవారం ఘాటు విమర్శలు చేశారు. ఉగ్రవాద పరిశ్రమకు పాకిస్థాన్ అధికార ప్రతినిధి అని.. అలాంటి దేశంతో చర్చల ప్రసక్తే లేదని జైశంకర్ కుండబద్ధలు కొట్టారు.