రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈనెల 23 న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక ఏడాదిలో మిగిలిన 8 నెలలకు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ఒక్కరోజు ముందే ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందు ఉంచనున్నారు. సమావేశాల్లో కేంద్రం 6 బిల్లులను సభ ఆమోదం కోసం తీసుకురానుంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రత అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షం భావిస్తోంది.
ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ 2024 ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకురానున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇదే కానుండడం గమనార్హం. దీంతో వరసగా ఏడుసార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ పొందనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించారు.