ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 20 నుంచి 25 వరకు ఆయన అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. జూన్ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు ప్రధాని నేతృత్వం వహించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
అమెరికా పర్యటనలో భాగంగా జూన్ 22న ప్రధాని మోదీ వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవుతారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. అదే రోజు సాయంత్రం అధ్యక్షుడు బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్.. మోదీకి అధికారిక విందు ఇవ్వనున్నారని వెల్లడించింది. దీనికంటే ముందు అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు విదేశాంగ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. జూన్ 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కలిసి ప్రధానికి ఆతిథ్యమివ్వనున్నారు. అమెరికా పర్యటన నుంచి ప్రధాని నేరుగా ఈజిప్టు వెళ్లనున్నారు. జూన్ 24, 25 తేదీల్లో ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు.