ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఇవాళ ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన ప్రధాని మోదీ.. బుధవారం నుంచి అగ్రరాజ్యంలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. “ఇండో-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ తెలిపారు. అంతేగాక, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఇరు దేశాలు కలిసి బలంగా నిలబడుతున్నాయని స్పష్టం చేశారు. న్యూయార్క్ నుంచి తాను నేరుగా వాషింగ్టన్ వెళ్లనున్నట్లు ప్రధాని చెప్పారు. వాణిజ్యం, సాంకేతికత, సృజనాత్మకత వంటి పలు రంగాల్లో ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించనున్నారు. ఇక, యూఎస్ కాంగ్రెస్ ఉభయసభలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఇక అమెరికా పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఈజిప్టుకు వెళ్లనున్నారు. జూన్ 25న రెండు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి భారత్ చేరుకోనున్నారు.