భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశం గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని కేవడియాలోని ఐక్యతా ప్రతిమ వద్ద మోదీ నివాళులు అర్పించారు.
“మన దేశ ఐక్యత శత్రువులకు కంటగింపుగా మారింది. అందుకే ఈ ఐక్యతను విడగొట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే కాదు, వేల సంవత్సరాలుగా విదేశీ శక్తులు భారత ఐక్యతను విడగొట్టేందుకు ప్రయత్నించాయి. ఆనాటి విషపూరిత యత్నాల వల్ల ఇప్పటికీ దేశం సమస్యలు ఎదుర్కొంటోంది. దేశవిభజనను, దాన్నుంచి శత్రువులు ప్రయోజనం పొందడాన్ని మనం కళ్లారా చూశాం. ఇప్పటికీ ఆ శక్తులు క్రియాశీలంగా ఉన్నాయి. దేశప్రజలు.. కులం, ప్రాంతం, భాషల పేర్లు చెప్పి ఘర్షణ పడాలని కోరుకుంటున్నాయి. వారందరికీ మనం సమాధానం చెప్పాలి. ఐక్యంగానే ఉంటామని చాటాలి.”
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి