ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటన ముగించుకొని ఆదివారం అర్ధరాత్రి తర్వాత భారత్ చేరుకున్నారు. దిల్లీలో విమానం దిగిన వెంటనే పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. మోదీ విమానం దిగిన వెంటనే ఆయన నోటిలో నుంచి వచ్చిన మొదటి మాట.. ‘భారత్లో ఏం జరుగుతోంది’ అని పార్టీ నేత ఒకరు తెలిపారు.
విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నేతలు హర్షవర్ధన్, గౌతం గంభీర్ తదితరులు విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు. వారిని చూసిన వెంటనే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ‘మమ్మల్ని చూడగానే దేశం గురించి అడిగారు. పనులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు’ అని పార్టీ నేత ఒకరు వెల్లడించారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనను బీజేపీ నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్తున్న విషయం తెలిసిందే. ‘ఆ కార్యక్రమం ఎలా నడుస్తోందని నడ్డాజీని అడిగారు. ప్రభుత్వం అందించిన సుపరిపాలన గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, ఈ ప్రభుత్వంపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని నడ్డాజీ వెల్లడించారు’ అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మీడియా వెల్లడించారు.