తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. హైదరాబాదులో ఇవ్వాళ్టి నుంచే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగతున్నాయి. పార్టీ విస్తరణను, మోడీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ ఈ సమావేశాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాదులో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మరియు పలు నాయకులు హాజరు కానున్నారు.
కాగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు తక్కువచేసి చూపించే క్రమంలోనే టీఆర్ఎస్ కూడా పక్కా వ్యూహంతో ముందుకు వెళుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో భారీ ర్యాలీని తలపెట్టింది టిఆర్ఎస్. ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో దిగడానికి అంటే కొన్ని గంటల ముందే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో ల్యాండ్ అయ్యారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు బేగంపేట ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి కేసీఆర్.బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి జలవిహార్ కు భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మోడీ దేశం ముందు తల దించుకున్నారు అంటూ కేసీఆర్ మండిపడ్డారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఏమైనా చేసావా.. ఏమైనా వచ్చాయా? పోయాయా అని ప్రశ్నించారు. మోడీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదని మండిపడ్డారు. టార్చిలైట్ వేసి వెతికినా మోడీ హామీలు నెరవేర్చినట్లు కనిపించవని ఎద్దేవా చేశారు. రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దేశానికి సేల్స్ మెన్ గా ప్రధాని వ్యవహరిస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. మోడీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు.