పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలు అవమానకరమని దుయ్యబ్టటారు.
‘‘తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే’’ అని రాహుల్ తెలుగులో ట్వీట్ చేశారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని క్షమాపణ చెప్పాలంటూ #PMshouldApologisetoTelangana హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ స్పందించారు.
1400 మంది మరణాలకు కారణమైంది కాంగ్రెస్ కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. పెద్ద మనషుల ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో కలిపిందెవరంటూ నాటి ప్రధాని నెహ్రూను ఉద్దేశిస్తూ దుయ్యబట్టారు. ఒక ఓటు – రెండు రాష్ట్రాలు అని బీజేపీ చెప్పాకే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని గుర్తుచేశారు. వేలాది మంది మరణాలకు కారణమైన గాంధీ కుటుంబం ఇంకెన్ని సార్లు క్షమాపణలు చెప్పాలి?.. రాహుల్ జీ ఇకనైనా స్క్రిప్ట్ మార్చండి అంటూ ఎద్దేవా చేశారు.