రక్షణ శాఖ స్టాండింగ్​ కమిటీలోకి రాహుల్ గాంధీ

-

లోక్​సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగిన కొన్ని రోజుల్లోనే.. రక్షణ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చిలో పార్లమెంట్​ సభ్యత్వం కోల్పోకముందు ఇదే కమిటీలో ఉన్న రాహుల్‌.. ప్రస్తుతం తిరిగి ఎంపికయ్యారు. ఈ కమిటీలోకి కాంగ్రెస్‌ ఎంపీ అమర్‌ సింగ్‌ కూడా నామినేట్‌ అయినట్లు లోక్‌సభ బులిటెన్‌ వెల్లడించింది.

లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఆప్​ ఎంపీ సుశీల్‌ కుమార్‌ రింకూ.. వ్యవసాయం, పశుసంవర్ధక, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ స్టాండింగ్‌ కమిటీకి నామినేట్ అయినట్లు పేర్కొంది. లోక్‌సభ సభ్యత్వం తిరిగి పొందిన ఎన్‌సీపీ ఎంపీ ఫైజల్‌ మొహమ్మద్‌.. వినియోగదారుల వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీకి నామినేట్‌ అయ్యారని తెలిపింది.

మరోవైపు 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని గుజరాత్​లోని సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేళ్లు శిక్ష విధించిన విషయం తెలిసిందే. రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆయన్ను దోషిగా తేల్చడంపై స్టే విధించింది. ఫలితంగా లోక్​సభ సభ్యత్వం పునరుద్ధరణ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version